ఏపీలో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం... అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

  • రాష్ట్రంలో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం
  • 1,215 హెక్టార్లలో వ్యవసాయ, 267 హెక్టార్లలో ఉద్యాన పంటలు ధ్వంసం
  • పంట నష్టంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
  • పూర్తిస్థాయిలో వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశాలు
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1,215 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 267 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ శాఖ అధికారులతో అమరావతిలో సమీక్ష నిర్వహించారు.

కృష్ణా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 16 మండలాల పరిధిలోని 89 గ్రామాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉందని అధికారులు సీఎంకు వివరించారు. మొత్తం 2,043 మంది రైతులకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. దెబ్బతిన్న పంటల్లో ప్రధానంగా 630 హెక్టార్లలో మొక్కజొన్న, 384 హెక్టార్లలో వరి, 200 హెక్టార్లలో మినుము ఉన్నాయని ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు.

వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటలపైనా వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా అనంతపురం, శ్రీసత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాల్లో 267 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మామిడి, ఆరెంజ్ వంటి పంటలు దెబ్బతిన్నాయని, దీనివల్ల 307 మంది ఉద్యాన రైతులు నష్టపోయారని ముఖ్యమంత్రికి వివరించారు.

ఈ ప్రాథమిక అంచనాలపై స్పందించిన ముఖ్యమంత్రి, క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో పంట నష్టాన్ని లెక్కించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, వాతావరణ మార్పులపై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించి వారిని అప్రమత్తం చేయాలని సూచించారు. తద్వారా భవిష్యత్తులో నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Chandrababu Naidu
AP Rains
Crop Damage
Andhra Pradesh
Untimely Rains
Agriculture Loss
Horticulture
Weather Updates
Farmer Distress
Krishna District

More Telugu News